AP Governor:సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నాం: గవర్నర్ నజీర్ 1 y ago
ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్నపాత్రుడు స్వాగతించారు. గవర్నర్ నజీర్ తన ప్రసంగంలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైనప్పటికీ, ప్రజలకు మేలు చేసే సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం పాలనలోకి రావడంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ వంటి చర్యలు తీసుకున్నాం అని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని.. కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, పేదలకు ఉచితంగా ఇళ్లు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడతామని గవర్నర్ తెలిపారు. 2027 నాటికీ పోలవరం పూర్తి చేస్తామని, అమరావతి ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించామని.. రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కూటమి ప్రభుత్వమే ఆపిందని తెలిపారు.
ప్రభుత్వం పెద్ద కంపెనీలను రాష్ట్రానికి రప్పించింది. గూగుల్, టాటా పవర్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. దీనివల్ల 6.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, ఈ పెట్టుబడుల ద్వారా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని గవర్నర్ తెలిపారు. ఐటి, ఏఐ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని.. తల్లికి వందనం, పేరెంట్-టీచర్ మీటింగ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిందని. గత అయిదేళ్లగా ప్రజలు కష్టపడ్డారని. ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. ప్రజల మేలు కోసం ఎన్నో పధకాలు తెస్తున్నామని వెల్లడించారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, సురక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తామని తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, ఐటీ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, రోడ్లు, పోర్టులు, మెట్రో రైలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్, తన పార్టీ సభ్యులతో కలిసి అసెంబ్లీని విడిచిపెట్టారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా, వైకాపా సభ్యులు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. వారు ప్రతిపక్షంగా తమను గుర్తించాలని నినాదాలు చేశారు, దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యకు సంబంధించిన విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.